తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మంగళవారం ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఆయన మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.
తెలంగాణ హైకోర్టు ఏర్పాటు అనంతరం అయిదో ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నట్లు సమాచారం.
కాగా, గవర్నర్ వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయన చివరిసారిగా గత ఏడాది అక్టోబరు 11న రాజ్‌భవన్‌కు వెళ్లారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.