Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాస్త ప్రజల అనారోగ్యం పట్టించుకోండి.. రాములమ్మ ఫైర్

కాస్త ప్రజల అనారోగ్యం పట్టించుకోండి.. రాములమ్మ ఫైర్
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (08:43 IST)
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే వల్ల కాక మరొకరు ఏడ్చినట్లుంది టీఆరెస్ నేతల వ్యవహారమంటూ రాములమ్మ ఫైర్ అయ్యారు. తెలంగాణ జనం విష జ్వరాలతో అల్లాడుతుంటే గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం... కేసీఆర్ తప్ప మరెవ్వరూ లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలనలో తనకే ముందుచూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్..విష జ్వరాల విషయంలో ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదన్నారు. ఆరోగ్య సమస్యలను చూపించి... తనను బలిపశువును చేయాలనే కుట్ర జరుగుతోందని, మంత్రి ఈటల సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయని విజయశాంతి పేర్కొన్నారు.

డెంగ్యూ, స్వైన్ ఫ్లూ జ్వరాలతో జనం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. సీజనల్ వ్యాధులను సీరియస్ పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూ పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే వాదనను కూడా విజయశాంతి ప్రస్తావించారు.

మంత్రి ఈటల జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించి... ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదన్నారామె. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లోనే జీహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ వ్యవస్థ నడుస్తోందనేది జగమెరిగిన సత్యమని ఆమె చెప్పారు.

ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ మెడకు చుట్టాలని ఈటల భావిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారని విజయశాంతి అన్నారు.

ఓ వైపు ఇంత బీభత్సం జరుగుతున్నా మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి తాను ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కులు చెల్లిస్తూ చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైందన్నారు.

బంగారు తెలంగాణ చేసి చూపుతామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అండ్ కో.. ఏ రకంగా అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో ఇటీవల పరిణామాలు చూస్తే అర్థమవుతుందని విజయశాంతి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ ఉద్యోగులకు ఇక పండుగే