Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగారమా?.. బాంబా?.. హడలెత్తిపోతున్న జనం

బంగారమా?.. బాంబా?.. హడలెత్తిపోతున్న జనం
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (08:12 IST)
బంగారం పేరెత్తితేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

తాజాగా ఢిల్లీ మార్కెట్లో సోమవారం నాడు 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం ధర రూ.39,670కి చేరింది. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి కావడం గమనార్హం. ఇక్కడి మార్కెట్లో వరుసగా ఐదో రోజూ బంగారం ధర పెరిగింది. ప్రపంచ మార్కెట్లో ట్రెండ్‌ బలంగా ఉండటం, రూపాయి బలహీనత వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తున్నట్టు అఖిల భారత సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది.

ఆగస్టు 20వ తేదీ నుంచి ప్రతి రోజూ బంగారం ధరల్లో కొత్త గరిష్ఠ స్థాయి నమోదవుతోంది. ఇక ఇక్కడి మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,450 పెరిగి రూ.46,550కి చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడం రజతం ధరల వృద్ధికి దారితీస్తోంది.

జువెలరీ తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్లో సానుకూల ట్రెండ్‌ వంటివి బంగారం ధరల్లో ర్యాలీకి కారణమవుతున్నాయి. ముంబై మార్కెట్‌లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.957 పెరిగి రూ.38,715కు చేరుకుంది. కిలో వెండి ధర ఒక్క రోజులోనే 1,395 పెరిగి రూ.45,215కు చేరింది.
 
ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది. తాజాగా ఔన్స్‌ బంగారం ధర 1,554 స్థాయికి చేరుకుంది. ఇది ఆరేళ్ల గరిష్ఠ స్థాయి ధర కావడం విశేషం. అమెరికా, చైనా దేశాలు ప్రతీకార పన్నులను విధించుకుంటున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం భద్రతమైనది ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, ఫలితంగానే ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
ముంబై రిటైల్‌ మార్కెట్లో సోమవారంనాడు పది గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ.40,000 స్థాయికి చేరుకుందని వ్యాపార వర్గాలు తెలిపాయి. అయితే తర్వాత ధరలు తగ్గినట్టు వ్యాపారులు తెలిపారు.

బంగారం, వెండి ధరల్లో ప్రస్తుత ట్రెండ్‌ కొనసాగే అవకాశం ఉందని, ఫలితంగా ధర రూ.39,900 నుంచి రూ.40,000కు చేరుకోవచ్చని రిలయన్స్‌ కమోడిటీస్‌ హెడ్‌ (కమోడిటీస్‌) ప్రీతమ్‌ కుమార్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.40,090కి చేరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ ఇమ్రాన్‌ వాచాలత