హైదరాబాద్ బర్కత్‌పురలో బుధవారంనాడు ఇంటర్ విద్యార్థిని మధులికపై కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో ప్రేమోన్మాది భరత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఆమెపై దాడిని ఓ పథకం ప్రకారమే చేశానని పోలీసుల ఎదుట భరత్ చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే వున్నట్లు వైద్యులు చెపుతున్నారు. పదునైన కత్తితో ఆమె తలపై దాడి చేయడంతో ఆమె పుర్రె ఎముక చీలిపోయిందనీ, మెదడుని తాకిందని తెలిపారు. ఇంకా పలుచోట్ల తీవ్ర గాయాలు వుండటంతో ఆమెకి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెకి ఇప్పటివరకు 15 యూనిట్ల రక్తం ఎక్కించామనీ, శరీరంలో 15 చోట్ల గాయాలయ్యాయని తెలిపారు. తలపై నాలుగుసార్లు నరకడంతో మెదడు లోపల తీవ్ర గాయాలయ్యాయనీ, ఆమె బీపి నార్మల్ అయిన తర్వాత శస్త్ర చికిత్స చేయాలనుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.