సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లితో సమానమైన అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను అతి దారుణంగా కత్తితో నరికాడు. పాలకొల్లు సమీపంలోని యలమంచి గ్రామంలో సంఘటన జరిగింది.
చక్రవర్తి, వెంకటలక్ష్మిలకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసై గత నాలుగు సంవత్సరాలుగా పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. అయితే సంవత్సరం నుంచి అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
భార్యకు, పిల్లలకు విషయం తెలుసు. అయితే ఎన్నోసార్లు భర్తకు నచ్చజెప్పి చూశారు. అయినా చక్రవర్తిలో మార్పు రాలేదు. పూటుగా మద్యం సేవించిన చక్రవర్తి తన అక్రమ సంబంధానికి భార్య, పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి నిద్రిస్తున్న వారిపై కత్తితో దాడికి దిగాడు. దీంతో ముగ్గురికి తీవ్ర రక్తగాయాలయ్యాయి.
స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడిన ముగ్గురిలో వెంకటలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా ఉన్న పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది వెంకటలక్ష్మి. నిందితుడు పరారీలో ఉన్నారు. వెంకటలక్ష్మి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.