హైదరాబాద్ బేగంబజార్ పరువు హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్ పర్వాన్‌ను హత్య చేసిన ఐదుగురు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం కర్నాటకకు పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో నీరజ్‌పై దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. నీరజ్ పన్వార్‌ను దాదాపు 20 సార్లు కత్తులతో పొడిచి చంపారు. పక్కా ప్లాన్ ప్రకాం నడిరోడ్డుపై యువకుడిని అడ్డగించి కత్తులతో పొడిచి హత్య చేశారు.
ఈ ఘటనపై టాస్క్‌ఫోర్స్ సహా నాలుగు బృందాలతో దర్యాప్తు కొనసాగింది. 10 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బేగంబజార్‌లోని పరువు హత్య కేసులో.. మృతుడు నీరజ్ భార్య సంజన ధర్నా చేపట్టింది. రెండు నెలల కుమారుడితో బంధువులతో కలిసి ధర్నాకు దిగింది.
తన భర్తను చంపిన వారిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేసింది. తన సోదరులే నీరజ్‌ను చంపారని, ఏడాది కాలంగా చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆమె చెప్పింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెట్టారని, ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది.