Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నాయ్.. తస్మాత్ జాగ్రత్త : సీఎం కేసీఆర్

Advertiesment
Hyderabad Rains
, బుధవారం, 21 అక్టోబరు 2020 (15:11 IST)
తెలంగాణ రాష్ట్రంలోని చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నాయని, ఇపుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెరువులతో పాటు నీటి ప్రాజెక్టులన్నీ పుష్కలంగా నిండివున్నాయి. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో బుధవారం ఉద‌యం సీఎం కేసీఆర్ స‌మీక్షించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరదల నేప‌థ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ముఖ్యంగా, భాగ్యనగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసాయన్నారు. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరింది. దీంతో న‌గ‌రంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని సీఎం ఆదేశించారు. 
 
అదేసమయంలో చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు, చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండి పండడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని, కట్టల పరిస్థితిని పరిశీలించాలి. 
 
ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
 
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వరదల కారణంగా అపార నష్టం వాటిల్లింది. దీన్ని అంచనా వేసేందుకు గురువారం సాయంత్రం న‌గ‌రానికి కేంద్రం బృందం రానుంది. ఈ బృందం రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచ‌నా వేయనుంది.
 
కాగా, ఈ నెల 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ర్ట ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర బృందం రేపు సాయంత్రం హైద‌రాబాద్‌కు రానుంది. 
 
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయం కింద రూ.550 కోట్లను విడుదల చేశారు. వ‌ర‌ద ప్ర‌భావిత‌మైన కుటంబాల‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక ఢిల్లీ ప్ర‌భుత్వం రూ.15 కోట్లు, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ.10 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం రూ.2 కోట్లు, మై హోం సంస్థ రూ.5 కోట్లు, టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.కోటి చొప్పున వరద సాయాన్ని ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లి ఘాటు.. వందకే ఐదు కేజీలు వచ్చేవి.. కానీ ఇప్పుడు..?