కరోనా లాక్డౌన్ కారణంగా అనేక ప్రజారవాణా సంస్థలు నష్టాల ఊబిలో కూరుకున్నాయి. ఇలాంటి వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ఒకటి. కరోనా కారణంగా గత మార్చి నెల 22వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్ళు పట్టాలపై పరుగులు పెట్టడం లేదు. ఫలితంగా రూ.200 నుంచి రూ.250 కోట్ల మేరకు నష్టాల ఊబిలో కూరుకున్నట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విచ్చలవిడిగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజా రవాణా సర్వీసులను పునఃప్రారంభానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోకు అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నారు.
నిజానికి మెట్రో ఇప్పటి వరకు లాభాలు ఆర్జించినదీ లేదు, అలాగని నష్టపోయిందీ లేదు. నగరంలోని మూడు మార్గాల్లో కలిపి రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణించేవారు. దీంతో వచ్చే ఆదాయం అక్కడికక్కడికి సరిపోయేది.
అయితే, లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి సేవలు నిలిచిపోయాయి. సర్వీసులు లేకపోయినా రైళ్లు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు తప్పనిసరి కావడంతో అందుకు నెలకు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.
ఇది సంస్థకు పెను భారంగా మారడంతో కొవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఉన్నతాధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజానికి మెట్రోకు ప్రయాణికుల నుంచి 45 శాతం మాత్రమే ఆదాయం రాగా, 50 శాతం వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా వస్తుంది.
మిగతా ఐదు శాతం మాత్రం వాణిజ్య ప్రకటనల ద్వారా వస్తుంది. అయితే, గత నాలుగు నెలలుగా ఇవేవీ లేకపోవడంతో మెట్రో నష్టాల బారిన పయనిస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ కూడా నష్టాల్లో నడుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు.