ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి రోజూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ వైరస్ బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా, ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారినపడ్డారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో బుధవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో జిల్లా కొవిడ్ సెంటర్‌లో చేరారు.
ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు ఆ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
మరోవైపు, రాష్ట్రంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట పడడం లేదు. రాష్ట్రంలో ప్రతి రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,062 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,259కి చేరుకుంది.
ఇంకోవైపు, కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్.జవహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు.
కాగా ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పడం గమనార్హం.