పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. దీంతో అనేక షాపులు, మాల్స్ తమ కంపెనీల పేరుతో లోగోలను ముద్రిస్తున్నాయి. ఇలాంటి బ్యాగులకు కూడా రూ.2 లేదా రూ.5 చొప్పున వసూలు చేస్తున్నాయి.
అయితే, ఆయా కంపెనీలు తమ లోగోలను ముద్రించివుంటే అలాంటి క్యారీబ్యాగులను ఉచితంగా ఇవ్వాల్సిందేనంటూ గతంలో చంఢీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. ఇపుడు ఈ తీర్పును ఆదర్శంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం తీర్పునిచ్చింది.
అంతేకాకుండా, లోగోవున్న క్యారీబ్యాగుకు రూ.5 ధర వసూలు చేసిన బేగంపేటలోని షాపర్స్‌స్టాప్ మాల్‌కు ఏడు వేల రూపాయల అపరాధం విధించింది. ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గత నెల 18వ తేదీన ఈ షాపింగ్ మాల్‌లో వస్తువులు కొనుగోలు చేయగా, ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇవ్వాల్సిన బ్యాగుకు రూ.5 వసూలు చేశారు.
నిజానికి డబ్బులు వసూలు చేస్తున్నందున లోగో లేని క్యారీ బ్యాగు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ లోగో ఉన్న క్యారీబ్యాగు ఇవ్వడంపై సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కారం కేంద్రం పై విధంగా తీర్పునిచ్చింది.