తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామిషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రభుత్వ, ప్రతిపక్షాలు సవాలుగా తీసుకున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ప్రధానపార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈటల దంపతులు అత్యధిక ధనవంతులుగా గుర్తింపు పొందారు. ఉపఎన్నిక నామినేషన్‌లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఉండగా, ఆ తర్వాత స్థానంలో రాజేందరే ఉన్నారు.
తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, చివరిస్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నిలిచారు. అయితే, ప్రతి ఎన్నికలో ఈటల జమున సెంటిమెంట్ కోసం తన భర్త రాజేందర్ కంటే ముందు నామినేషన్ వేస్తుంటారు. రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తుండటంతో జమున నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోనున్నారు.
జమున నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటే ఈటల రాజేందర్ రూ.16.12 కోట్ల ఆస్తులతో హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా నిలువనున్నారు. ధన ప్రవాహంతో జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఈ నెల 30 తర్వాత తేలనుంది.