Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

ఇల్లు కావాలని దంపతులు వస్తున్నారా.. తాళాలు పగుల్తాయ్ జాగ్రత్త..!

మనుషులు మంచివాళ్లుగా ఉండటానికి, మంచివాళ్లు కూడా చెడ్డవాళ్లుగా, దొంగలుగా, భ్రష్టులుగా మారడానికి సమాజంలోని పరిస్థితులే కారణం అంటే సిద్ధాంతాలు వల్లించవద్దు అంటూ విసుర్లు రావడం సహజం. ఈరోజుల్లో అయితే నీతిబోధలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పైగా అంత ఓపికా

Advertiesment
Husband and wife
హైదరాబాద్ , సోమవారం, 12 జూన్ 2017 (04:00 IST)
మనుషులు మంచివాళ్లుగా ఉండటానికి, మంచివాళ్లు కూడా చెడ్డవాళ్లుగా, దొంగలుగా, భ్రష్టులుగా మారడానికి సమాజంలోని పరిస్థితులే కారణం అంటే సిద్ధాంతాలు వల్లించవద్దు అంటూ విసుర్లు రావడం సహజం. ఈరోజుల్లో అయితే నీతిబోధలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పైగా అంత ఓపికా ఎవరికీ లేదు. కానీ మన కళ్ల ముందు జరుగుతున్న వాస్తవాలు మనుషుల ప్రవర్తనకు, నడతకు వారుంటున్న సమాజమే కారణం అని తిరుగులేని విధంగా నిరూపిస్తున్నాయి. 
 
హైదరాబాద్‌లో ఒక సెక్యూరిటీ గార్డు, రోజువారీ కూలిగా దిగజారి, అక్కడా బతుకు సాగించలేక చివరకు దొంగతనాలే వృత్తిగా స్వీకరించిన వైనం పై సత్యాన్ని కొత్త రూపంలో ఆవిష్కరిస్తోంది. విషయంలోకి వస్తే.. వారిద్దరూ భార్యాభర్తలు .. ఆమె అతడికి రెండో భార్య.. ఉన్న ఉద్యోగం పోవడంతో రెండు ఫ్యామిలీలను మేనేజ్‌ చేయడం అతనికి కష్టంగా మారింది.. దీంతో రెండో భార్యతో కలసి దొంగతనాలు మొదలెట్టాడు. ఇందుకు టూలెట్‌ బోర్డులు ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేసుకున్నారు. ఇలా పలుచోట్ల దొంగతనాలు చేసి చివరికి కటకటాలపాలయ్యారు. 
 
పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేటలో నివశిస్తున్న ఒగ్గు శ్రీనివాస్‌ గతంలో సెక్యూరిటీగార్డుగా పనిచేశాడు. వివాహితుడైన ఇతడు అదే ప్రాంతానికి చెందిన పనిమనిషి వి.రేణుకను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య ఇతడిపై వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం రెండో భార్యతోనే కలసి జీవిస్తున్న ఇతడు అప్పుడప్పుడు మొదటి భార్య పోషణ సైతం చూస్తున్నాడు. సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడంతో ఉద్యోగం పోగొట్టుకున్న శ్రీని వాస్‌ దినసరి కూలీగా మారాడు. 
 
ఇలా వచ్చే ఆదాయంతో రెండు కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. దీంతో రెండో భార్యతో కలసి చోరీలు చేయాలని పథకం వేశాడు. తన కైనటిక్‌ హోండాపై పగటిపూట సంచరిస్తూ రెక్కీలు చేస్తాడు. టూలెట్‌ బోర్డు ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటారు. తాము భార్యాభర్తలమని, ఇల్లు అద్దెకు కావాలంటూ యజమానితో మాట్లాడతారు. 
 
ఓవైపు ఇలా చేస్తూనే మరోపక్క ఆ భవనంలో తాళం వేసున్న మరో ఇంటిని గుర్తిస్తారు. యజమానితో మాట్లాడటం పూర్తయి, ఆయన ఇంట్లోకి వెళ్లిపోయిన తర్వాత తాళం వేసున్న ఇంటి వద్దకు వెళ్తారు. దాని తాళం పగులకొట్టి లోపలకు ప్రవేశించి అందినకాడికి ‘ఊడ్చేస్తారు’. ఆపై చోరీ సొత్తుతో తమ వాహనంపై వెళ్లిపోతారు. ఇలా జూబ్లీహిల్స్, లాలాగూడ, మల్కాజ్‌గిరిల్లో పంజా విసిరారు. 
 
లాలాగూడ ఠాణా పరిధిలో 10 రోజుల క్రితం నేరం జరగడంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలిలోని సీసీ కెమెరా ఫీడ్‌ ఆధారంగా చోరులు వాడిన వాహనాన్ని గుర్తించారు. మరో 100 సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేసి.. ఆ వాహనం అంబర్‌పేట వెళ్లినట్లు గుర్తించారు. ఈ దంపతుల్ని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. వీరి నుంచి 100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు, వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ప్రభుత్వం చేయలేని పని జనం చేశారు.. మాల్యాను దొంగ దొంగ అన్నారు.. ముఖం మాడ్చుకున్న మాల్యా