గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయిలో ఉంది. దీంతో ఆస్పత్రులన్నీ నిండుకున్నాయి. అనేక మంది రోగులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో కరోనా నియంత్రణకు జీహెచ్ఎంసీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా పాజిటివ్ బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు లక్ష హోం ఐసోలేషన్ కిట్లను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల వారీగా హోం ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.
ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. హోం ఐసోలేషన్ కిట్ల కోసం కరోనా పాజిటివ్ బాధితులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 040 - 2111 1111.
ఇదిలావుండగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొనసాగుతోన్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌లో కొవిడ్ కౌన్సెలింగ్ సెంటర్‌ను పరిశీలించారు. జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. స్వల్ప జ్వరం లక్షణాలున్న వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రుల్లో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులు ఇచ్చే మందులను తప్పనిసరిగా వాడాలని చెప్పారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని ఆయన ఆదేశించారు. సీఎస్‌తో పాటు హెల్త్ సెక్రటరీ రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో పాటు పలువురు ఉన్నారు.