మున్సిపల్ ఎన్నికల వార్డుల విభజనపై వచ్చిన అభ్యంతరాలను సర్కారు పరిష్కరించిన తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కరోజులోనే అభ్యంతరాలన్నీ పరిష్కరించడం ఎట్ల సాధ్యమని ప్రశ్నించింది. సర్కారు చర్యలు కంటితుడుపులా ఉన్నాయనీ, ఏ మాత్రం నమ్మకం కలిగించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్నికల ప్రక్రియ చట్ట విరుద్ధంగా ఉందని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంజుకుమార్ రెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డి వేర్వేరుగా వేసిన పిల్స్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం మరోసారి విచారించింది. మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు నెల రోజుల టైం అడిగిన సర్కారు 8 రోజుల్లోనే ఎట్ల చేసిందని బెంచ్ ప్రశ్నించింది.
‘‘వార్డుల విభజనపై వచ్చిన 1373 అభ్యంతరాలు అన్నింటినీ ఒకే రోజులో ఎలా పరిష్కరించేశారో అర్ధం కావట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాల్ని జూన్ 21 నుంచి 30 వరకూ చేశామన్నారు. అది ఎట్లా చేశారో కూడా చెప్పలేదు. సర్కార్ చెబుతున్న వాదన వాస్తవానికి దూరంగా ఉన్నట్లుంది” అని ఘాటుగా కామెంట్ చేసింది.
మున్సిపోల్స్ కేసులో సర్కారు కౌంటర్ పిటిషన్ కూడా సరిగా వేయలేదని బెంచ్ చెప్పింది. ‘‘ఒక విషయం చెప్పినప్పుడు అది ఎలా చేశారో చెప్పకుండా నామమాత్రంగా కౌంటర్ వేసినట్లుగా ఉంది. ఉదాహరణకు జనాభా నిష్పత్తి మేరకు వార్డుల విభజన ఎట్లా చేశారో చెప్పలేదు. విభజన చేయడానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుకు ఎలాంటి శిక్షణ ఇచ్చారో చెప్పలేదు. 1373 అభ్యంతరాలు వస్తే 665 అభ్యంతరాల్ని పరిష్కరించామని చెప్పారేగానీ ఎట్లా చేశారో వివరించలేదు.
మిగిలిన 708 అభ్యంతరాల్ని ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా కారణాలు లేవు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ పూర్తికి 109 రోజులు కావాలని సింగిల్ జడ్జి దగ్గర చెప్పారు. అందులో వార్డుల విభజనకు 30 రోజులు పడతాయన్నారు. కానీ 8 రోజుల్లోనే ఎట్లా చేశారో అంతుబట్టట్లేదు.
అంతా చూస్తుంటే హడావుడిగా చేశారని అర్ధమైపోతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యంతరాలను పరిష్కరించిన తీరు చూస్తే, నిజంగానే పరిష్కరించారా అనే డౌట్ వస్తోంది” అని బెంచ్ వ్యాఖ్యానించింది.