బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం పడుతోంది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో గాలి వానకు చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా 42 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురవగా 241 ప్రాంతాల్లో సాధారణ వర్షం కురిసింది. 541 ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావం నేడు, రేపు కూడా ఉంటుందని పేర్కొంది.
తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన గడ్డం అనిల్(37) బైక్‌పై ఊరికి వస్తూ మార్గమధ్యలో పెద్దంచెరువు వాగును దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డిలో పిడుగుపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.