అధికారుల అలసత్వం వల్ల మిషన్ భగీరథ పథకం కింద రావాల్సిన నీళ్లు... ఇప్పటికీ తన సొంత గ్రామానికి రావట్లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా త్వరగా పనులు పూర్తి చేసి ఇంటింటికీ నీళ్లందించాలని సూచించారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ అధికారుల అలసత్వంతో... తన సొంత గ్రామానికే భగీరథ నీళ్లు రావడం లేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
నిర్మల్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, కలెక్టర్లతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని... ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి త్వరలోనే ఇంటింటికీ నీళ్లందించాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా ఇంటి నల్లా కనెక్షన్‌లు చేపట్టకపోవడం వల్లే నీళ్లు అందించలేకపోతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు వివరించారు.
క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ కాంట్రాక్టర్లు, వర్కింగ్ ఏజెన్సీలతో వేగంగా పని చేయించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి, రాఠోడ్ బాపురావు, రేఖాయాక్, నిర్మల్ జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, కలెక్టర్‌లు దివ్యాదేవరాజన్, ఎం.ప్రశాంతి పాల్గొన్నారు.