గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు అమితాసక్తిని రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు (జీహెచ్ఎంసీ) హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార తెరాస గుడ్డిలో మెల్లగా బయటపడింది. భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటివరకు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపించలేదు. ఈ వైఖరిపై ఎస్ఈసీ కన్నెర్రజేసింది.
ముఖ్యంగా ఓడిన అభ్యర్థులు ప్రచార లెక్కలు సమర్పించడంలో నిర్లక్ష్యం చేస్తుంటే గెలిచిన వారు సంబురంలో మర్చిపోతున్నారు. నిబంధనల ప్రకారం ఖర్చు వివరాలను 45 రోజుల్లో ప్రకటించకుంటే అనర్హత వేటు పడనుంది. గతంలో దాదాపు 18 మంది సర్పంచ్లు, 945 మంది వార్డు సభ్యులు పదవులను కోల్పోగా, మరో 1800 మంది మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుకు గురయ్యారు.
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన 1122 మంది కూడా లెక్కలు చూపించడం లేదు. ఇప్పటికే నెల రోజులు గడిచాయి. అయినా ఒక్కరు కూడా లెక్క చూపించడం లేదు. వాస్తవంగా ప్రచారంలో చేసిన ఖర్చును రోజువారీగా అభ్యర్థులను ప్రతిపాదించిన వారిలో ఒకరు లెక్క వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఒక్కటీ, రెండు రోజులకే లెక్కలిచ్చి తర్వాత మర్చిపోయారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ప్రచార వ్యయ పరిమితి రూ.5 లక్షలుగా నిర్ధారించారు. దేనికి ఎంతెంత లెక్క ఉంటుందనే వివరాలిచ్చారు. కొన్నిచోట్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు వివరాలను అభ్యర్థుల ప్రచారంలో జత చేశారు. కానీ కొంతమంది ఇవ్వకపోవడంతో ప్రచార పరిశీలకులు ఆయా జెండాలు, గుర్తులు, కండువాలతో ప్రచారంపై అంచనా వేసుకుని ఖర్చు వివరాలను వారి ఖాతాల్లో జమ చేశారు.
ఎన్నికల సంఘానికి ఖర్చులు వివరాలు అందించకపో తే మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. 2016లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 1800 మంది ఎన్నికల వ్యయ వివరాలను సకాలంలో అధికారులకు సమర్పించలేదు. దీంతో వీరిపై 2019లో నిర్ణయం తీసుకుని అనర్హత వేటు వేశారు. వీరిలో కొందరు 2021 వరకు, 2022 వరకు మరికొంతమంది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం చాలా మంది ఓడిన అభ్యర్థులు వివరాలు ఇవ్వలేదు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా ఈ నెల 19 వరకు ఎన్నికల ఖర్చు వివరాల్సిందే. ఇప్పటికే ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 8న అబ్జర్వర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వార్డుల వారీగా వివరాలను ఫైనల్ చేయనున్నారు. ఆ తర్వాత ఖర్చు లెక్కలిచ్చిన వారి నివేదికలను పరిశీలించి వ్యయాన్ని నిర్ధారించనున్నారు. ఒకవేళ లెక్కల వివరాలు ఇవ్వకుంటే వేటు వేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. గెలిచిన అభ్యర్థులు ప్రచార వ్యయాన్ని చూపించకుంటే అనర్హత వేటు పడనుంది.