Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడిలైడ్‌కు ప్రతీకారం.. మెల్‌బోర్న్‌లో టీమిండియా ఘన విజయం...

Advertiesment
అడిలైడ్‌కు ప్రతీకారం.. మెల్‌బోర్న్‌లో టీమిండియా ఘన విజయం...
, మంగళవారం, 29 డిశెంబరు 2020 (09:32 IST)
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత క్రికెట్ జట్టు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. ఆతిథ్య జ‌ట్టు ఆప‌సోపాలు ప‌డిన పిచ్‌పై భారత బౌల‌ర్స్‌, బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. ఫలితంగా రెండో టెస్ట్ మ్యాచ్‌ను మరో రోజు మిగిలివుండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 
 
ముఖ్యంగా భార‌త బౌల‌ర్స్ బెబ్బులిలా విజృంభించి ఆస్ట్రేలియాని రెండు ఇన్నింగ్స్‌లలో 200 ప‌రుగుల లోపే క‌ట్ట‌డి చేశారు. బంతులని రాకెట్‌లా విస‌రుతూ  బుమ్రా, సిరాజ్‌లు ఆస్ట్రేలియాని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తే అశ్విన్, జ‌డేజాలు త‌న మ‌ణిక‌ట్టు మాయాజాలంతో కంగారూల‌ని కంగారెత్తించారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ కొద్దిగా ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ, శుభ్‌మ‌న్ గిల్‌, ర‌హానే, జ‌డేజాల అద్భుత పోరాట ప‌టిమ‌తో తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 131 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. 
 
ఆ తర్వాత 131 వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తన రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా 200 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 కాసేపు ప్రతిఘ‌టించ‌డంతో భార‌త్ విజయం కాస్త లేట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు, ఉమేష్ ఒక వికెట్‌ తమ ఖాతాల్లో వేసుకున్నారు. 
 
పిమ్మట 70 పరుగుల విజయ ల‌క్ష్యంతో లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్ చేప‌ట్టిన టీ మిండియా ఆదిలో రెండు వికెట్లు వెంట వెంట‌నే కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగ‌ర్వాల్ (5) ప‌రుగుల‌కు ఔట్ కాగా, పుజారా(3) ప‌రుగుల‌కు పెవీలియ‌న్ బాట ప‌ట్టారు. తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్(35), స్టాండింగ్ కెప్టెన్ ర‌హానే(24)తో క‌లిసి భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో స‌మం అయింది. ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలివున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెల్‌బోర్న్ టెస్ట్ : ఆసీస్ 200 రన్స్‌కే ఆలౌట్.. భారత్‌ విజయభేరీ - సిరీల్ లెవల్