అయోధ్య రాముడిని రాజకీయ లాభాల కోసం భాజపా ఉపయోగిస్తోందని, డబ్బు వసూలు చేసిన తరువాత నకిలీ రశీదులు ఇస్తున్నారని ఆరోపిస్తూ పరకాల టిఆర్ఎస్ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి ఆదివారం మరోసారి వ్యాఖ్యానించారు. కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు తర్వాత ఫండ్ కలెక్షన్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన రెండవ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆయన.
అయోధ్యలోని రామాలయం పేరిట నిధులు సేకరించడానికి నకిలీ పుస్తకాలు సిద్ధం చేశారని ధర్మారెడ్డి ఆరోపించారు. అయోధ్య ఆలయానికి నిధుల వసూలు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేసారు. "సర్దార్ పటేల్ విగ్రహం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,900 కోట్లు ఖర్చు చేసినప్పుడు, అయోధ్య కోసం మరో 11 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయలేదు" అని ఆయన ప్రశ్నించారు.
ధర్మారెడ్డి మాట్లాడుతూ, “బిజెపి నాయకులు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాలు వసూలు చేయడం దారుణం. నిధుల సేకరణకు సరైన డాక్యుమెంటేషన్ చూపించిన తర్వాత మాత్రమే వారు విరాళాల సేకరణ ప్రారంభించాలి. విరాళాల పేరిట ప్రజలను బెదిరిస్తున్నారు. నేను రాముడి నిజమైన భక్తుడిని, ఆయన కోసం నా ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించాను "అని ఆయన అన్నారు. అసలు మాకు భద్రాచలంలో శ్రీరాముడు వుండగా అయోధ్య రాముడి కోసం విరాళాలు ఎందుకివ్వాలంటూ ప్రశ్నించారు.
ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బిజెపి వరంగల్ పట్టణ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ నేతృత్వంలోని బిజెపి నాయకులు హనమకొండలోని ధర్మారెడ్డి నివాసంపై రాళ్ళు రువ్వారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో, జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తూ, ధర్మారెడ్డి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అక్కడే రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. అనంతరం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు.