Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భగవంతునికి కానుకలతో పాటు ఇవి కూడా సమర్పిస్తే... (video)

Advertiesment
భగవంతునికి కానుకలతో పాటు ఇవి కూడా సమర్పిస్తే... (video)
, బుధవారం, 23 డిశెంబరు 2020 (23:32 IST)
దేవునికి కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. అలాగే దేవాలయాలకు దానం చేసినా పుణ్యం దక్కుతుంది. అదేమిటో చూద్దాం. దేవాలయాల్లో ఏమి దానం చేయాలో చాలామందికి తెలియదు. ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు.
 
అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జెలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.
 
చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు.
 
చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.
 
దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే సుగంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర
లోహాలు ఇచ్చినవాడు పుణ్య ఫలితాన్ని పొందుతాడు.
 
పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి. నీల పతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి, దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కోటి ఏకాదశి: తులసీ దళాలతో పూజ మరవకూడదట..!