తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధం ఉన్న వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఇక్కడ దోపిడీ సరిపోదన్నట్టుగా ఢిల్లీలో కూడా దందాలు చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో వేల ఎకరాల భూమిని మాయం చేశారన్నారు. ఇలాంటి మోసగాళ్ళతో పాటు వీరిని ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో శిక్షతప్పదని ఆయన హెచ్చరించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఈ స్కామ్‌లో ఇప్పటికే పలువురుని అరెస్టు చేశారు. మరికొందరికి నోటీసులు జారీచేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్యే కె.కవిత పేరు కూడా ఉంది. ఆమెను ఉద్దేశించి ఈటల రాజేందర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్నవారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ఇక్కడ చేసిన దోపిడీలు సరిపోదన్నట్టుగా ఢిల్లీకి పోయి దందాలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నవారికి ఖచ్చితంగా శిక్ష పడక తప్పదని ఆయన హెచ్చరించారు.
2014లో జరిగిన ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం తెరాసకు వేయాలని నాడు కేసీఆర్ పిలుపునిచ్చారన్నారు. కానీ, నేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓట్లు కొనుక్కునే స్థాయికి కేసీఆర్ ఎందుకు దిగజారిపోయారని ఆయన ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము ధారాదత్తం చేస్తున్నది ఎవరో చెప్పాలని ఆయన నిలదీశారు.
తెరాస పార్టీ ఖాతాలో రూ.800 కోట్ల వైట్ మనీ ఉందనీ కేసీఆర్ చెప్పారని, అతి తక్కువ కాలంలో ఇంత భారీగా సొమ్ము ఎలా వచ్చిందని ఈటల ప్రశ్నించారు. ఉపవాసం ఉన్న పార్టీకి ఇంత తక్కువకాలంలో వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. ఎవరూ డబ్బులు ఊరికే ఇవ్వరని ఈ విషయంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఈటల విజ్ఞప్తి చేశారు.