గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఠాగూర్". ఇందులో చనిపోయిన వ్యక్తి (శవం)కి ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల పాటు వైద్యం చేసిన సన్నివేశం ఉంది. ఇపుడు అచ్చం అలాంటి సీన్ ఒకటి ఇపుడు రిపీట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ నెలలు నిండటంతో ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడామెకు వైద్యం చేసిన తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే, కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు లోనైంది. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టిన వైద్యులు.. ఆమెకు మరింత మెరుగైన వైద్యం చికిత్స అందించాల్సివుందని నమ్మించి అదే రోజు రాత్రి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడామెకు వైద్యం అందిస్తున్నట్టుగా చెబుతూనే ఆమె కోలుకుంటుందని బంధువులను నమ్మించారు.
ఆ తర్వాత తమ ప్రయత్నం ఫలించలేదని, అందుకే ఆమె చనిపోయిందని తాపీగా వెల్లడించారు. దీంతో బంధువులకు అనుమానం వచ్చి బాధితులు గొడవకు దిగడంతో ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చింది. గొడవ మరింత పెద్దదై బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యుతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.8 లక్షల ఇస్తామని ఒప్పందం రాసిచ్చినట్టు సమాచారం.