రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుని పోయే ప్రమాదం పొంచి ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
గడిచిన ఐదేళ్లలో ఆర్థిక రాబడులు ఏవిధంగా ఉన్నాయి....2023-24 నాటికి ఆర్థిక రాబడులు, ఖర్చులు ఎలా ఉంటాయి తదితర అంశాలను వివరిస్తూ సీఎల్పీ మీడియా పాయింట్‌లో భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు తెచ్చి...ఖర్చు పెట్టి ఆస్తుల పెంపకంపై దృష్టి పెట్టకపోవడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
2023-24 నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొత్తానికి రూ.36వేల కోట్లు తక్కువ చేసి పూర్తి స్థాయి బడ్జెట్‌ను పెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు.
కేంద్రం నుంచి ఏటా రావల్సిన గ్రాంట్స్ ఇన్ ఎయిడెడ్ నిధుల అంచనాలను క్రమంగా పెంచుతూ వెళ్లిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఉన్నఫలంగా తగ్గించి ఆ నెపం కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికే ఇలా చేశారని ధ్వజమెత్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాల అమలు, అప్పులకు వడ్డీ, వాయిదాల చెల్లింపులకే రూ.లక్షా28వేల కోట్లు అవసరమవుతాయన్నారు.
రాష్ట్ర రెవెన్యూ రూ. లక్షా 13 వేలు కాగా...భూములు అమ్మితే వచ్చే ఆదాయాన్ని కూడా రెవెన్యూలో కలిపారని ఆరోపించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర అప్పులు రూ. 4.60 లక్షల కోట్లకు పెరిగే ప్రమాదం ఉందని...అప్పులు తెస్తే కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని, పథకాలు కొనసాగించలేని ప్రమాదం ఏర్పడిందన్నారు.
కేసీఆర్ తెచ్చిన అప్పులన్నీ పాలకుల ప్రయోజనాలకేనంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ వాస్తవాలను అన్ని జిల్లా కేంద్రాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు.