కన్నతండ్రి పాముకాటుతో కన్నుమూసాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దానితో అతడి కుమార్తె జోలె పట్టి భిక్షాటన చేసింది. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గ్రామంలో వివేకానంద విగ్రహం వద్ద నాగుపాము కనిపించడంతో దుర్గయ్య అనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. దాంతో అతడు అక్కడికి వచ్చి పామును పట్టుకుని సంచిలో వేస్తుండగా అతడిని పాము కాటు వేసింది. దీనితో దుర్గయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఐతే మార్గమధ్యంలోనే దుర్గయ్య కన్నుమూశాడు. కూలి పనులు చేసుకుంటూ ఏరోజుకారోజు పొట్టపోసుకుని బ్రతుకుతున్న దుర్గయ్య చనిపోవడంతో అతడి అంత్యక్రియలు చేసేందుకు పిల్లల వద్ద పైసా లేకుండా పోయింది. దీనితో అతడి కుమార్తె, కొడుకు ఇద్దరూ గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ భిక్షాటన చేసారు. వచ్చిన డబ్బుతో తండ్రి అంత్యక్రియలు చేసారు.