తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని ఆరునూరైనా కొనసాగించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, దళిత బంధు పథకం యధాతథంగా అమలు అవుతుందన్నారు.
దళిత బంధు పథకం హుజూరాబాద్‌లో సంపూర్ణంగా అమలై తీరుతోంది. దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌లో ఈ పథకం అమలు కోసం రూ.2 వేల కోట్లు విడుదల చేశాం. పథకంపై అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తున్నాం. దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు చెప్పారు.
"తెలంగాణ దళిత జాతిని అభివృద్ధి చేసే బాధ్యత నాదే. హుజూరాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అమలు చేసి తీరుతాం. మిగతా నాలుగు మండలాల్లో కూడా నేనే స్వయంగా వెళ్లి.. 100 కుటుంబాల చొప్పున అమలు చేస్తాం. మిగతా నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు అమలు చేస్తాం. ఈ ప్రక్రియ మార్చి లోపు అమలవుతోంది. వచ్చే మార్చి లోపు 20 లక్షల కుటుంబాలకు అమలు చేస్తాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్ది అన్ని కుటుంబాలకు వర్తిస్తాం. తెలంగాణ దళితజాతి అభివృద్ధి ఏడాది, రెండేండ్లో చేసి చూపిస్తాం" అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అలాగే, త్వరలోనే 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. నిరుద్యోగులకు నేను చెప్తున్నా.. మంచి ఉద్యోగ కల్పన జరుగుతోంది. ఉద్యోగ నియామకాలకు క్యాలెండర్ విడుదల చేస్తాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా నిబంధనలు రూపొందించాం. నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తోందని తెలిపారు.
జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులను సర్దుతున్నాం. ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తాం. నవంబర్‌లో ఉద్యోగుల సర్దుబాటు పక్రియ పూర్తి చేసి.. 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుపుతాం. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు అని సీఎం కేసీఆర్ అన్నారు.
అంతేకాకుండా, తాము రాజకీయ పార్టీగా ఉంటామని బహిరంగంగానే ప్రకటించానని, అంతేకానీ సీక్రెట్‌గా చీకట్లో చెప్పలేదని అన్నారు. అభిప్రాయాలు, ఆలోచనలు నచ్చిన వారు ఇతర పార్టీల నుంచి వచ్చి తమ పార్టీలో చేరతామంటే చేర్చుకుంటామని, దానిలో తప్పేముందని ప్రశ్నించారు.
అలా వచ్చిన వారు సీనియర్లు అయితే రాష్ట్రం కోసం వారి అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు మంత్రి పదవులు ఇచ్చినా తప్పు లేదు కదా? అని అన్నారు. అలా చేయడమే తప్పని బీజేపీ భావిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలో ఎలా చేర్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమీటి సభ్యుడిగా ఉన్న సింధియాను కేంద్ర మంత్రి వర్గంలో చేర్చుకోలేదా? అని నిలదీశారు. తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనే చందంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.