Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైతన్యం ద్వారానే సైబర్ ఆధారిత లైంగిక వేధింపులకు చెక్

చైతన్యం ద్వారానే సైబర్ ఆధారిత లైంగిక వేధింపులకు చెక్
, శనివారం, 1 ఆగస్టు 2020 (22:55 IST)
సైబర్ ఆధారిత లైంగిక వేధింపుల నుండి తప్పించుకునేందుకై ప్రసుతం ఉన్న చట్టాలపై అవగాహన, ఆన్లైన్ లో ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఏవిధమైన ఆధారాలతో సైబర్ క్రైమ్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలన్న అంశాలపై మహిళలు, యువతను మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని పలువురు పోలీసు అధికారులు, ఐ.టీ. రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. 
 
తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా "సైబర్ స్పేస్ ద్వారా పిల్లలు, మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ఎలా అరికట్టడం" అనే అంశంపై శనివారం సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్‌లా స్కూల్, సైబర్ పీస్, ఐసాక్‌ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో మహబూబ్ నగర్ జిల్లా ఎస్.పీ. రెమా రాజేశ్వరి, సైబర్ పీస్ ఫౌండేషన్‌కు చెందిన సైబర్ వ్యవహారాల అడ్వొకేట్  జెనీస్ వర్గీస్, ఐసాక్ డైరెక్టర్ రాజా శేఖర మూర్తి, సి.ఐ.డీ .డీ. డీ.ఎస్.పీ. రవికుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
 
ఇప్పటికీ ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా ఉపయోగించే ఏంతో మంది ప్రదానంగా యువతీయువకులు, మహిళలు సైబర్ ఆధారిత లైంగిక దాడులకు గురవుతున్నారని, అయితే తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం నిర్వహిస్తున్న సైబ్-హర్ చైతన్య కార్యక్రమం ద్వారా చైతన్యం పొంది దైర్యంగా పోలీస్ స్టేషన్లలో, సైబర్ క్రైమ్ స్టేషన్లలో, డయల్ 100ల ద్వారా ఫిర్యాదు చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎస్.పీ. రెమా రాజేశ్వరి పేర్కొన్నారు.
 
ఇప్పటికీ మన పిల్లలు బుద్ధిమంతులుగానే ఉన్నారనే భావన ప్రతీ పేరెంట్లో ఉండటం సహజమని, అయితే కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇంటర్నెట్‌ను ఉపయోగించడం దాదాపు రెండుమూడింతలు పెరిగిందని, ఈ నేపథ్యంలో తమకు తెలియకుండానే లైంగిక నేరాలతో సహా పలు నేరాల బారిన పడే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. సైబర్ నేరాలకు సంబంధించి ఏవిధంగా గురవుతారు, ఒకవేళ గురైతే పోలీస్‌ను గాని, సైబర్ నేరాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి, డయల్ 100, ఫిర్యాదు చేసే మెయిల్ ఐ.డీ.లను పిల్లలకు, ప్రతీ ఒక్కరికీ తెలియచేయాలని సూచించారు.
 
పిల్లలు పోలీసు అధికారులంటే క్రేజ్ ఉంటుందని, పాఠశాల అసెంబ్లీ సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి వెళ్లి సైబర్ నేరాలకు గురయ్యే విధానం, వాటిని ఎదుర్కొనే అంశాలపై ఒక పది నిమిషాల పాటు ఉపన్యశింసించడం ద్వారా చైతన్య పర్చాలని ఐసాక్ డైరెక్టర్ రాజా శేఖర మూర్తి పేర్కొన్నారు. ఇంస్టాగ్రామ్, వాట్సప్‌లలో వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేస్తే ముందు ముందు ఏవిధమైన ఇబ్బందులు ఎదురైతాయో స్పష్టంగా తెలియ చేయాలని, ఈ విషయంలో జరిగిన కొన్నిసంఘటనలను ఉదాహరించారు.
 
సైబర్ సెక్యూరిటీ రంగంలో అడ్వొకేట్‌గా ఉన్న జానీస్ వర్గీస్ మాట్లాడుతూ, లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులు అధికంగా విదేశీ నెంబర్లను ఉపయోగిస్తుంటారని, విదేశీ నెంబర్ల నిందితులను గుర్తించి పట్టుకునే అవకాశం ఉండదనే అపోహ చాలా మందికి ఉంటుందని, అయితే, ఎక్కడి నెంబరునైనా గుర్తించి పట్ట్టుకునే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పోలీస్ శాఖ వద్ద ఉంటుందనేది తెలియ చేయాలని తెలిపారు. తద్వారా తాము వేధింపులకు గురయ్యే నెంబర్లను, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేస్తారని అన్నారు. తమ మొబైల్స్‌లో ఉండే ఆధారాలను, లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ డిలీట్ చేయవద్దని తెలియచేయాలని వర్గీస్ అన్నారు. ఈ కార్యక్రమానికి డీ.ఎస్.పీ. రవి కుమార్ రెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్, ప్లాస్మా చికిత్స ఎలా పనిచేస్తుంది?