దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తయారు చేసిన కరోనా టీకాల పంపిణీ ప్రారంభమైంది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు మంగళవారం ఉదయం తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు.
మొత్తం 6.5 లక్షల డోసుల కొవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్రానికి చేరుకున్నాయి. వీటిని శంషాబాద్ నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించనున్నారు. కోఠి ఆరోగ్య కార్యాలయంలో 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ ఏర్పాటు చేశారు.
ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. రాష్ట్రం వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయనున్నారు.
మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయనుంది. బుధ, శనివారాల్లో యధావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
అలాగే, పూణె నుంచి వ్యాక్సిన్ లోడ్‌తో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న స్పైస్ జెట్, వ్యాక్సిన్‌ను రవాణా చేసే అవకాశం తమకు లభించడం గర్వకారణమని పేర్కొంది. సకాలంలో అన్ని నగరాలకూ టీకాను చేర్చే విషయంలో తాము కట్టుబడివున్నామని వెల్లడించింది.
ఇక, టీకా విమానాశ్రయానికి చేరిందని ఢిల్లీ ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడిస్తూ, హర్షం వ్యక్తం చేశాయి. కరోనా మహమ్మారి దేశంలోకి వచ్చిన తొలినాళ్లలో వైద్య పరికరాలను అన్ని ప్రాంతాలకూ చేర్చేందుకు ఎంతో కృషి చేశామని, టీకాను కూడా అన్ని ప్రాంతాలకూ చేరుస్తామని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సీఈఓ తెలిపారు.
తమ విమానాశ్రయంలో రెండు కార్గో టర్మినల్స్‌ను ప్రత్యేకంగా మైనస్ 20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతను నిర్వహించేలా తయారు చేశామని వెల్లడించిన ఆయన, ఎయిర్ పోర్టులో ఉన్నంత వరకూ టీకాలను భద్రంగా నిల్వ చేస్తామని అన్నారు. రోజులో 57 లక్షల టీకా డోస్‌లను నిల్వ చేసే సామర్థ్యం ఉందని అన్నారు.
ఇదిలావుండగా, అన్ని రాష్ట్రాలకూ టీకాను చేర్చేందుకు పలు లాజిస్టిక్ సంస్థలు, ఎయిర్ లైన్స్ కంపెనీలు, విమానాశ్రయాలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోంది. ఈ తెల్లవారుజామున మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పూణె ఎయిర్ పోర్టుకు వ్యాక్సిన్ చేరుకోగా, వాటిని వివిధ నగరాలకు తరలించారు.
ఇక విమానాశ్రయాలకు చేరిన టీకాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జీపీఎస్ సౌకర్యంతో పాటు అతి శీతల వాతావరణ పరిస్థితుల మధ్య పట్టణాలకు తరలించే పనులను కూడా అధికారులు ప్రారంభించారు.
వాహనానికి పోలీసు భద్రతతో పాటు, వాహనం ఏ దారిలో వెళుతుందన్న విషయాన్ని అనుక్షణం గమనించేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కోటి 32 కిలోల బరువుండే బాక్స్ లు 478 వరకూ దేశంలోని వివిధ నగరాలకు దాదాపు చేరిపోయాయి.