Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో ఆర్టీసీ - విద్యుత్ చార్జీల బాదుడు తప్పదా?

తెలంగాణాలో ఆర్టీసీ - విద్యుత్ చార్జీల బాదుడు తప్పదా?
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:48 IST)
కరోనా కష్టకాలంలో కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని రవాణా శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా విద్యుత్ చార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై తుది నిర్ణయాన్ని వచ్చే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 
 
మంగళవారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రధానంగా చర్చించారు. 
 
జరిగిన సమీక్షలో విద్యుత్‌ సంస్థలు, ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రులు, అధికారులు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఛార్జీల పెంపు కోసం సమగ్ర ప్రతిపాదనల్ని రూపొందించాలని సీఎం కేసీఆర్‌ వారిని ఆదేశించారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని.. సంస్థ గాడిలో పడుతున్న సమయంలో... కరోనా, డీజిల్‌ ధరల పెంపు భారంతో తిరిగి నష్టాల్లో కూరుకుపోయాయని సీఎం వ్యాఖ్యానించారు.
 
బస్సు ఛార్జీలను పెంచాల్సిందేనని మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. కరోనా సంక్షోభంతోపాటు డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీ పరిస్థితి దిగజారిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాదిన్నరకాలంలో డీజిల్‌ ధరల పెరుగుదలతో రూ.550 కోట్లు, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరలతో మరో రూ.50 కోట్లు కలిపి... ఏటా 600 కోట్ల భారం పడుతోందన్నారు. 
 
ముఖ్యంగా, లాక్డౌన్ల వల్ల ఆర్టీసీ సుమారు రూ.3000 కోట్ల మేర నష్టపోయిందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు నష్టం వస్తోందన్నారు. ఈ కష్టకాలంలో ఛార్జీలు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తెచ్చారు.
 
ఆరేళ్లుగా ఛార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి ఇప్పుడు పెంచక తప్పదన్నారు. ఆర్టీసీతోపాటు విద్యుత్ అంశాలకు సంబంధించి వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అధికారులకు హామీ ఇచ్చారు.  ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రుల్ని, సంబంధిత అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛాన్సుల‌ కోసం లహరి నాతో క్లోజ్ గా ఉంటుందన్న రవి