కరోనా వైరస్ పైన హై ఎలర్ట్ నేపధ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష చేశారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పల్మనలజిస్ట్ అందరినీ అందుబాటులో ఉండేలా చూడాలని, అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఈటెల రాజేందర్.
సోమవారం నుంచి గాంధీ మెడికల్ కాలేజ్‌లో కరోనా వైరస్ పరీక్షలు చేస్తారని, ప్రతి రోజు 30 మందికి పరీక్షలు చేయడానికి కిట్ అందుబాటులో వుంటుంది. ఒక పరీక్షకు 10 గంటల సమయం పడుతుంది. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదు. చైనా నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు ఈటెల.
ఆసుపత్రుల్లో చేరినవారికి చికిత్స అందించేందుకు అన్నివసతులు ఏర్పాటు చేశాము, మాస్క్‌లు, సానిటైజర్లు, సరిపోయేంతమంది సిబ్బందిని సిద్దంగా ఉంచాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా అమలుచేస్తున్నాము.
ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉంది. ప్రతి గంటకు పర్యవేక్షణ చేస్తున్నాము. ప్రజలు ఎంతమాత్రం భయపడవద్దు అని విలేకరుల సమావేశంలో తెలియచేశారు.