కరోనా నివారణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న 155 మంది హైదరాబాద్ పోలీసులు కరోనావైరస్ బారినపడ్డారు.
పోలీస్ డిపార్ట్ మెంట్ లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రత్తమయ్యారు. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు విధులకు హాజరవద్దని, ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
రోజురోజుకు పోలీసుశాఖలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 15 మంది పోలీసులకు కరోనా సోకింది.
వారం రోజుల నుంచి సిటీలో జరుపుతున్న కరోనా టెస్టుల ద్వారా ఇవన్నీ బయటపడుతున్నాయి. తాజాగా 20 మంది పోలీసులకు కరోనా కన్ఫర్మ్ అయింది. సిటీలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు 155 మంది పోలీసులకు సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కుల్సుపురా పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ మే 20న కరోనా బారినపడి చనిపోయాడు. దాంతో ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన పోలీసులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తమతో పాటు తమ కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకే అవకాశముండటంతో.. వారివారి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా క్వారంటైన్ చేసి అందరికీ టెస్టులు చేస్తున్నారు.
కరోనా సోకిన పోలీసుల కోసం గాంధీ ఆస్పత్రిలో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. కోల్డ్, ఫీవర్, కఫ్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ లక్షణాలు లేనివారికి నేచర్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.