హైదరాబాద్ నగరంలో ఓ కరోనా బాధితుడు తీసిన సెల్ఫీ వీడియో ఇవుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊపిరాడక గుండె ఆగిపోయేలా ఉంది డాడీ, ఆక్సిజన్ పెట్టమన్నా వైద్యులు పెట్టలేదు డాడీ... బాయ్ డాడీ అంటూ ఓ సెల్ఫీ వీడియో ఇపుడు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తోంది.
హైదరాబాద్ జవహర్ నగర్‌కు చెందిన రవికుమార్ అనే యువకుడు కరోనా బారినపడటంతో ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ కుర్రోడు ఊపిరి అందడంలేదని వెంటిలేటర్ పెట్టాలని వైద్యులను బతిమిలాడగా, వైద్యులు వెంటిలేటర్ పెట్టలేదని ఆ యువకుడు మరణానికి ముందు తన సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు.
ఊపిరందక గుండె ఆగిపోయేలా ఉందని, చచ్చిపోతున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. చివరగా "బాయ్ డాడీ" అంటూ అందరి హృదయాలు కలిచివేశాడు. దాదాపు 3 గంటల పాటు నరకయాతన అనుభవించిన రవికుమార్ మృత్యువుతో పోరాటంలో ఓడిపోయాడు.
దీనిపై ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతో రవికుమార్ చనిపోయాడనడం సరికాదని, కరోనా వైరస్ కారణంగా గుండెపై ప్రభావం పడుతుందని చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ తెలిపారు. కరోనా వైరస్ యువకుల్లో ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తుందని, గుండె దెబ్బతిన్న తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని వివరించారు.