తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరిసింహా స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి 11 గంటలకు బయలుదేరే సీఎం కేసీఆర్ యాదాద్రి కొండపైకి చేరుకుని ఆలయ ఉద్ఘాటనకు సంబంధించిన పనులను పరిశీలిస్తారు.
అలాగే, మహాకుంభ సంప్రోక్షణ, మహాసుదర్శన యాగం నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపుతారని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. కాగా, గత 2014లో సీఎం హోదాలో తొలిసారి యాదాద్రికి వచ్చిన కేసీఆర్.. ఇప్పటివరకు 15 సార్లు ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లారు.
మరోవైపు, ఈ నెల 11వ తేదీన జనగామ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లా పార్టీ నేతలు ఏర్పాటు భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇందుకోసం బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.