తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వెనుక అతిపెద్ద కుట్ర ఉందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ శతాబ్దపు అతిపెద్ద కుట్రగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆదివారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగడంతో పాటు, ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలన్నారు. కానీ, సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్లు జోకర్‌ను తలపిస్తున్నాయని దుయ్యబట్టారు.
గతంలో గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చాయని, ఈసారీ వచ్చాయని, భవిష్యత్తులో రావని కూడా చెప్పలేమన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం భారీ వర్షాలు మానవ సృష్టిలా కన్పిస్తోందని, పైగా విదేశాల కుట్ర అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని, విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్ అని విమర్శించారు.
మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయి పూర్తిగా నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకుంటారో సీఎం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.