ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ ఛైర్మన్&ఎండీ కృష్ణా ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా కలిశారు.
కరోనా వ్యాక్సిన్ స్థితి, భారత్ దేశంలో, ప్రపంచంలో కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలను చర్చించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)లతో కలిసి ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు ఉపరాష్ట్రపతికి కృష్ణా ఎల్లా తెలిపారు.
భారత్ బయోటెక్‌లోని బీఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) బయో కంటైన్మెంట్ సదుపాయంలో స్వదేశీ, క్రియారహిత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఇటీవలే ప్రధాన మంత్రి మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శించి కొవాగ్జిన్ వ్యాక్సిన్ స్థితిపై సమీక్షించినట్లు వెంకయ్యకు వారు తెలిపారు.
జీనోమ్ వ్యాలీలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాల గురించి తెలుసుకునేందుకు వివిధ దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు సందర్శించినట్లు వెల్లడించారు.
ప్రపంచస్థాయి ఉత్పత్తుల్లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం గురించి ఉపరాష్ట్రపతి భారత్ బయోటెక్ ఛైర్మన్‌కు వివరించారు. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ల పరస్పర సహకారాన్ని కొనియాడారు.