Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్.. మా పిల్లి బావిలో పడింది... సీపీకి అర్థరాత్రి ఫోన్.. స్పందించిన పోలీసులు

Cats Massaging Dog
, మంగళవారం, 28 జూన్ 2022 (10:40 IST)
తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దీంతో  24 గంటల పాటు వారు అప్రమత్తంగా ఉంటూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తున్నారు. తాజా తమ పిల్లి బావిలోపడిందంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు అర్థరాత్రి ఆ పిల్లిని కాపాడారు. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్‌లోని కేడీసీసీ బ్యాంక్‌ వద్ద నివాసం ఉంటున్న మనోహర్‌ ఇంటి వెనకాల ఎవరూ వినియోగించని చేదబావి ఉంది. ఇంటి పరిసరాల్లో సంచరించే రెండు పిల్లులు ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పోట్లాడుకున్నాయి. ఒక పిల్లి బావిలో పడిపోయింది. 
 
ఆ సమయంలో అక్కడే ఉన్న మనోహర్‌ కుమార్తె స్నితిక (10వ తరగతి) గమనించి తన తండ్రికి చెప్పింది. వారిద్దరూ గూగుల్‌లో జంతు సంరక్షణ సిబ్బందిని ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం థర్మాకోల్‌ షీట్‌ను బావిలో వేసి పిల్లిని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 
 
జంతువుల సంరక్షణ సిబ్బంది సూచనతో అర్థరాత్రి మనోహర్‌ కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. స్పందించిన కమిషనర్... ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును అప్రమత్తం చేశారు. ఆయన తన సిబ్బందితో అర్థరాత్రి 12.30 గంటలకు జాలి గంపను బావిలోకి పంపి పిల్లిని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో మనోహర్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలంటీర్లు మన పార్టీ కార్యకర్తలే కదా.. వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది...!