Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏసీబీ డైరెక్టర్ చారుసిన్హా బదిలీ వెనుక ఇంత తతంగం ఉందా?

ఓటుకు నోట్లు కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఇటీవల ఈ కేసులో దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ కాపీ రాజ్‌భవన్‌కు చేరడం సంచలనాత్మకంగా మారింది. ఏసీబీ డైరెక్టర్‌ చారుసిన్హాను నేరుగా రాజ్‌భవన్‌కు పిలిపించుకుని అక్కడి అధికార వర్గాలు చార్జిషీట్‌ కాపీ

Advertiesment
ఏసీబీ డైరెక్టర్ చారుసిన్హా బదిలీ వెనుక ఇంత తతంగం ఉందా?
హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (05:42 IST)
ఓటుకు నోట్లు కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఇటీవల ఈ కేసులో దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ కాపీ రాజ్‌భవన్‌కు చేరడం సంచలనాత్మకంగా మారింది. ఏసీబీ డైరెక్టర్‌ చారుసిన్హాను నేరుగా రాజ్‌భవన్‌కు పిలిపించుకుని అక్కడి అధికార వర్గాలు చార్జిషీట్‌ కాపీలు తీసుకున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆలస్యంగా వచ్చింది. కీలకమైన కేసు, పైగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో రాజ్‌భవన్‌ వర్గాలు ఎందుకు చార్జిషీట్‌ తెప్పించుకున్నాయో తెలియక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లోలోన ఆందోళనకు గురవుతున్నాయి.

రాజ్‌భవన్‌ అదనపు చార్జిషీట్‌ కాపీ తెప్పించుకున్న ఈ తాజా ఎపిసోడ్‌ వెనుక కథేంటి అసలు ఏం జరిగి ఉంటుందన్న కోణంలో పోలీసు ఉన్నతాధికారవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏసీబీ డైరెక్టర్‌ నుంచి చార్జిషీట్‌ తెప్పించుకున్న కొద్ది రోజులకే గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం గమనార్హం.
 
చెప్పనందుకే చారుసిన్హాపై వేటు!
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఒక్కరే కావడంతో రాజ్‌భవన్‌ నుంచి ఏ ఆదేశాలు వెలువడ్డా పోలీసు ఉన్నతాధికారులు తక్షణం స్పందించాల్సిందే. ఏ వ్యవహారంపైనైనా రాజ్‌భవన్‌ వర్గాలు నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఈ రెండున్నరేళ్లలో చాలాసార్లు జరిగింది. పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని గవర్నర్‌ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అదే మాదిరి ఇటీవల రాజ్‌భవన్‌ నుంచి ఏసీబీ డైరెక్టర్‌కు ఫోన్‌ వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో ఇటీవల దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ కాపీ కావాలన్న ఆదేశం అందులో ఉంది.
 
దీంతో హుటాహుటిన చార్జిషీట్‌ కాపీలు తీసుకొని అప్పటి డైరెక్టర్‌ చారుసిన్హా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ కార్యాలయంలో అందజేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు ట్విస్ట్‌ అక్కడే మొదలైంది. రాజ్‌భవన్‌ కార్యాలయం కీలకమైన కేసులో చార్జిషీట్‌ కాపీలు అడిగితే తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. గవర్నర్‌ అడగడంలో తప్పులేదని, అయితే ఆ విషయాన్ని దాచిపెట్టడమే ఆ అధికారి చేసిన తప్పు అని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంకేదైనా విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారేమోనని భావించి.. ఏసీబీ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
 
మాజీ డీజీ ఏకే ఖాన్‌ అతి చర్యపై చారు సిన్హా ఆగ్రహం
ఏసీబీకి గతంలో డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. అయితే సర్వీసులో ఉన్నంత వరకే ఆయనకు పర్యవేక్షణ అధికారం ఉంటుంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనతో ఆ విభాగానికి ఎలాంటి సంబంధం, కేసులో జోక్యం ఉండకూడదు. కానీ పదవీ విరమణ చేసిన సరిగ్గా నెలన్నర తర్వాత ఖాన్‌ ఏసీబీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అప్పటి డైరెక్టర్‌ చారుసిన్హాకు కనీస సమాచారం లేకుండా కేసుకు సంబంధించి సంబంధిత అధికారులతో రెండున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం.. దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో అదనపు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 
 
ఈ వ్యవహారం తెలుసుకున్న చారుసిన్హా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎంత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయినా.. పదవీ విరమణ తర్వాత తన ఆధ్వర్యంలో ఉన్న విభాగానికి వచ్చి తనకు తెలియకుండా కీలకమైన కేసులో సమీక్ష చేసి చార్జిషీట్‌ వేయమని చెప్పడంతో ఆమె అసహనానికి గురయ్యారు. ఇదే వ్యవహారంపై ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
 
పదవీ విరమణ పొందిన తర్వాత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వ్యవహరించిన తీరు రాజ్‌భవన్‌ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని రాజ్‌భవన్‌ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నేరుగా అదనపు చార్జిషీట్‌ కాపీలు తెప్పించుకొని పరిశీలించి ఉంటారని అటు ఏసీబీ వర్గాలు, ఇటు పోలీస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సమీక్షకు అప్పటి డైరెక్టర్‌ సహకరించలేదని ప్రభుత్వానికి మాజీ డీజీ ఫిర్యాదు చేసినట్టు చర్చ జరుగుతోంది. అటు రాజ్‌భవన్‌కు కాపీలు పంపడం, ఇటు మాజీ డీజీకి సహకరించకపోవడంతో ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
 
ఏసీబీ గతనెల 18న ఓటుకు కోట్లు కేసులో అదనపు చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజున రాజ్‌భవన్‌కు చార్జిషీట్‌ కాపీలు వెళ్లాయి. తర్వాత పది రోజులకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతి, ప్రధాని, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తదితర ప్రముఖులందరితో భేటీ అయ్యారు. దీనితో రెండు ప్రభుత్వాల వర్గాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోందని పలువురు చెబుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు 120 కి.మీ వేగంతో వెళ్లిందా?