బుద్ధం శరణం గచ్చామి అని అంతా అంటారు కానీ, బుద్ధుడు కన్న కలలు నెరవేరడం లేదని తెలంగాణ పర్యటకశాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పర్యటకశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అంతర్జాతీయ బౌద్ధ సంగీతి (సదస్సు)ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సమాజంలో మనిషిని మనిషిగా జీవించమని గౌతమ బుద్ధుడు ప్రబోధించారని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
దేశంలో కుల వ్యవస్థ నరనరాన జీర్ణించుకుని ఉందని... అభివృద్ధి కాకపోవడానికి కుల వ్యవస్థే కారణమన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పర్యటక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న తెలంగాణ అంతర్జాతీయ బౌద్ధ సంగీతి (సదస్సు)ను మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పన్యాల భూపతి రెడ్డి, ఎండీ దినకర్ బాబు, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, భారత పురావస్తు సర్వే డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నం పాల్గొన్నారు. భారత్ సహా 17 దేశాల ప్రతినిధులు, పరిశోధకులు, పురావస్తు నిపుణులు, విద్యార్థులు సదస్సుకు హాజరయ్యారు.
బుద్ధం శరణం గచ్చామి అని అంతా అంటారు కానీ, బుద్ధుడు కన్న కలలు నెరవేరడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో క్రీస్తుపూర్వం నాటి చరిత్ర వెలికి తీయడం వల్ల లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా రాని సంపద వెలుగులోకి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలోనే సీఎం చేతుల మీదుగా బుద్ధవనం ప్రారంభోత్సవం చేస్తామని ప్రకటించారు. చరిత్ర నిలబడాలని ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఆలోచించి ఆచరణలో చూపారని కొనియాడారు. పర్యటక, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యూజియంను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.