హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఒకటి బీభత్సం సృష్టించింది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో చిన్నారి, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బీభత్సం గురువారం రాత్రి జరిగింది. ఈ కారుకు ఉన్న స్టిక్కర్ బోధన్ షకీల్ అమీర్ అహ్మద్ పేరున ఉండటం గమనార్హం.
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... గత రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్ నుంచి కేబుల్ వంతెన మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో బ్రిడ్జిని దాటి రోడ్డు నంబరు 1/45 చౌరస్తా వైపు వేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పిల్లలను ఎత్తుకుని బెలూన్లు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహా, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలను ఢీకొట్టింది. దీంతో వారి చేతుల్లో ఉన్న రెండున్నర నెలల రణవీర్ చౌహాన్, యేడాది వయస్సున్న అశ్వతోష్ కిందపడ్డారు. చిన్నారులను ఎత్తుకున్న మహిళలకు గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే కారును నడుపుతూ వచ్చిన వ్యక్తి దానిని అక్కడే వదిలేసి పారిపోయాడు. గాయపడిన చిన్నారులను, మహిళలను పోలీసులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ పసికందు రణవీర్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.