నలుగురు డిప్లొమా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెరువు కట్టపై బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు వెళ్లి చనిపోయారు. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కోదాడలో బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న చక్రాల ప్రవీణ్ తన పుట్టిన రోజు సందర్భంగా 15 మంది స్నేహితులతో కలిసి కోదాడలోని పెద్ద చెరువు కట్టమీద గల గుడి వద్ద చేసుకున్నారు.
వారంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత సమీర్ అనే యువకుడు చేతులు కడుక్కునేందుకు చెరువులోకి దిగి నీటి వద్దకు వెళ్లాడు. అపుడు ప్రమాదవశాత్తు పట్టుకోల్పోయి చెరువులో పడిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో మరో ఇద్దరు చెరువులోకి దిగారు.
లోతు ఎక్కు వగా ఉండడంతో చక్రాల ప్రవీణ్(18), హుజూర్ నగర్‌కు చెందిన భవాని ప్రసాద్ (17), నేరేడుచర్లకు చెందిన సమీర్ (17), ఖమ్మం జిల్లా పైనంపల్లికి చెందిన మహీందర్ (17) మృతిచెందారు. ఈ సంఘటనతో భయపడిన మిగిలిన స్టూడెంట్స్ అక్కడి నుంచి పరారయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని చెరువులో నుంచి నలుగురి తదేహాలను వెలికితీశారు. తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతం మొత్తం విషాదం అలముకుంది. పుట్టినరోజు నాడే ప్రవీణ్ మృతిచెందడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.