దుబ్బాక ప్రజలు కేసీఆర్ జీతగాడిని కాకుండా.. తమ కోసం పనిచేసే వ్యక్తిని రాష్ట్ర శాసనసభకు పంపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. చేగుంటలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో భట్టి విక్రమార్క మల్లు పాల్గొని ప్రసంగించారు.
దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపు అని భట్టి అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై భట్టి నిప్పులు చెరిగారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ఎందుకు అవసరమో ఆయన వివరించారు. అసెంబ్లీ కాంగ్రెస్ శాసనసభ పక్షం కబడ్డీ అడుతుందనే భయం కేసీఆర్ లో ఉందని అన్నారు.
ఎల్.ఆర్.ఎస్ పేరుతో కేసీఆర్ పేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ పెళ్లి కోసమో, కొడుకుల చదువుల కోసమే.. భవిష్యత్ కోసమే కష్టపడి రూపాయి రూపాయి దాచుకుని కొనుక్కున్న ఇంటి స్థలంకు పన్ను అడగడం ఏమిటని ఆయన కోపంగా ప్రశ్నించారు.
ఎల్.ఆర్.ఎస్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని అన్నారు. బర్రెలు కట్టే పాకుకు, గొఱ్ఱల కొట్టనికి, మేకల కట్టే గుంజకు కూడా రేపు కేసీఆర్ పన్నులు వేస్తాడని అన్నారు. కేసీఆర్ తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టుకునేందుకు పేదల రక్తాన్ని తాగుతున్నదని అన్నారు.
అలాగే ఉమ్మడి రాష్ట్రంలో మద్యం ఆదాయం రూ.11వేల కోట్ల రూపాయలు ఉంటే. ఇప్పుడు ఒక్క తెలంగాణలో రూ.26 వెల కోట్లుగా ఉందని భట్టి చెప్పారు. ఇస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు.. ఉద్యొగలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు అని భట్టి చెప్పారు.