కెనరా బ్యాంక్ ఏటీఎం కేంద్రాల్లో డబ్బును లోడ్ చేసేందుకు వచ్చిన డ్రైవర్ అదును చూసి మూడు లక్షలతో పారిపోయాడు. వాహనంలో రూ. 37 లక్షలు ఉన్నప్పటికి బ్యాక్సులను మోయలేక రూ.3 లక్షల బాక్సుతో పాటు రెండు సెక్యూరిటీ గన్‌లతో పరారయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్లలో రైటర్ సేఫ్ గార్డు సంస్థ నగదును లోడ్ చేస్తుంది. ప్రతి రోజు వివిధ రూట్‌లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో వాహనాల్లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి నగదును లోడ్ చేస్తారు.
గురువారం సిబ్బంది అశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ గార్డులు కె.వి.రామ్, చంద్రయ్యలు రూ.72 లక్షలతో డ్రైవర్ ఫారూఖ్‌తో కలిసి వాహనంలో బయలుదేరారు. అహ్మద్‌నగర్, ఎన్‌ఎండీసీ, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదును లోడ్ చేసి ఆయా కేంద్రాల్లో మిగిలిన బాక్సులను తీసుకుని వాహనంలో లోడ్ చేశారు.
సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వచ్చారు. సిబ్బంది ఆశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కె.వి.రామ్, చంద్రయ్య లోపలికి వెళ్లి షట్టర్ వేసుకుని నగదును లోడ్ చేస్తున్నారు. సెక్యూరిటీకి చెందిన రెండు ఏయిర్ పిస్తల్‌లను వాహనంలోనే ఉంచారు.
ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఫారూఖ్ వాహనంతో ఉడాయించాడు. ఏటీఎంలో డబ్బులు లోడ్‌చేసి బయటికి వచ్చిన సిబ్బంది చూడగా వాహనం కనిపించకపోవడంతో 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
వాహనంలో మిగిలిన నగదు బాక్సులు ఉండడం, ఒక్క బాక్సు మాత్రమే కనిపించకపోవడం, రెండు గన్‌లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు నగదును లెక్కించగా రూ.3 లక్షలు బాక్సుతో డ్రైవర్ పారిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.