Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన పర్వతారోహకురాలు అన్విత రెడ్డి

Anvita reddy
, మంగళవారం, 17 మే 2022 (21:54 IST)
తెలంగాణ రాష్ట్రం, భువవగిరికి చెందిన పర్వతారోహకురాలు అన్విత రెడ్డి (24) 2022 మే 16న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పేరు గాంచిన అన్విత గ్రూప్ అనితర సాధ్యమైన ఈ సాహస యాత్రకు అవసరమైన శిక్షణకు ఆర్ధిక సహకారాన్ని అందించింది.

 
అన్విత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ఈ గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన సహకారాన్ని అందించారని ఈ సందర్భంగా అన్విత రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ నిర్వహిస్తున్న హిమాలయాల స్ప్రింగ్ క్లైంబింగ్ సీజన్‌లో ఇంటర్నేషనల్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ టీమ్‌లో అన్విత భాగస్వామిగా ఈ రికార్డును సాధించారు. 1997లో జన్మించిన అన్విత రెడ్డి అతి సామాన్యమైన వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. తల్లి దండ్రులు పడమటి మధుసూధన్ రెడ్డి, చంద్రకళ. తల్లి అక్కడి అంగన్‌వాడీ పాఠశాలలో పనిచేస్తారు.

 
భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఇన్‌స్ట్రక్టర్ శిక్షణను పూర్తి చేసి, పర్వతారోహణ సంస్థల్లో ప్రాథమిక, అడ్వాన్స్ పర్వతారోహణ కోర్సులను పూర్తి చేశారు. 2021 ఫిబ్రవరిలో ఖాడే పర్వతాన్ని (భారతీయ హిమాలయాలు - త్సో-మోరిరి, లడఖ్) అధిరోహించారు. 2021 జనవరిలో కిలిమంజారో పర్వతాన్ని (ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరం) అధిరోహించారు.

 
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ద్వారా శీతాకాల శిక్షణను లేహ్‌లో పూర్తి చేశారు. 2021 డిసెంబర్లో ఎల్బ్రస్ పర్వతాన్ని (యూరోప్ ఖండంలోని ఎత్తైన శిఖరం) అధిరోహించిన ఏకైక భారతీయురాలిగా రికార్డులకెక్కారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం కోసం ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ద్వారా 2022 జనవరిలో ప్రత్యేక ప్రిపరేషన్ కోర్సును పూర్తి చేసారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో రియల్ ఎస్టేట్ కార్యకాలాపాలు నిర్వహించే అన్విత గ్రూప్‌ అధినేత అచ్చుత రావు బొప్పన పర్వతారోహణలో అన్వితారెడ్డి ప్రతిభను గుర్తించి, ఆమె లక్ష్యాలను సాధించేందుకు పూర్తి స్దాయి స్పాన్సర్‌షిప్‌తో మద్దతుగా నిలిచారు.

webdunia
అన్విత రెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో భారతదేశంలోని నేపాల్‌లో (ఉత్తర భాగం చైనాలో ఉంది) దక్షిణం వైపు నుండి పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు. డాక్యుమెంటేషన్, సామగ్రి కొనుగోలు కోసం ఖాట్మండులో కొన్ని రోజులు గడిపిన తర్వాత, ఆమె లుక్లా వెళ్లారు. ఇక్కడ నుండి బేస్ క్యాంపుకు చేరుకోవడానికి 9 రోజుల పాదయాత్ర సాగింది. 2022 ఏప్రిల్ 17వ తేదీన 5300 ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. తదుపరి వారాల్లో అన్విత పర్వతం పైకి ‘రొటేషన్స్’ పూర్తి చేసారు. ఒక భ్రమణంలో సభ్యులు బరువుతో ఎత్తైన శిబిరాలకు ఎక్కి అక్కడ ఒక రాత్రి ఉండి, శిబిరాలకు తిరిగి వస్తారు. ఈ పద్ధతిలో వారి శరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు సర్దుబాటు చేసుకుంటుంది. భ్రమణం సమయంలో అన్విత 7,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు.

 
అన్విత 2022 మే 12న బేస్ క్యాంప్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు, వివిధ స్థాయిలలో నాలుగు శిబిరాలను దాటారు. తన షెర్పా గైడ్‌తో క్యాంప్-4 నుండి 15 మే 2022 రాత్రి బయలుదేరి 16 మే 2022న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకున్నారు. ప్రస్తుతం అమె శిఖరం నుండి దిగుతుండగా, బుధవారం నాటికి బేస్ క్యాంప్‌కు చేరుకుని ఈ నెలాఖరుకు హైదరాబాద్ వస్తారు. ఈ నేపధ్యంలో అన్వితా గ్రూపు అధినేతలు బొప్పన అచ్యుతరావు, బొప్పన నాగభూషణం అన్వితా రెడ్డిని అభినందించారు. అన్విత కృషి, పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్ స్టోన్ సాయంతో రూ. 6.5 లక్షల ఉద్యోగాన్ని సాధించిన విజయవాడ విద్యార్థి