తెలంగాణా రాష్ట్రంలోని ఖలా వరంగల్‌లో ఓ యువకుడుని కొందరు వ్యక్తులు ఉత్తిపున్నానికే కొట్టి చంపేశారు. అగ్గిపెట్టి ఉందా అంటూ ఆ యువకుడు అడిగాడు. ఈ మాటకే ఆగ్రహించిన ఆ ముఠా అతనిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆకెన పవన్‌కల్యాణ్ (23) తన స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు లేబర్‌కాలనీలోని ఎంఎన్‌కే ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.
మద్యం తాగిన తర్వాత రెస్టారెంట్ ప్రాంగణంలో ఉన్న పాన్‌షాపునకు వెళ్లి సిగరెట్ కొనుగోలు చేశారు. అగ్గిపెట్టె కావాలని బార్ అండర్ రెస్టారెంట్‌లో నుంచి బయటకు వస్తున్న శివనగర్‌కు చెందిన కుసుమ యశ్వంత్ (25)ను అడిగాడు.
దీంతో ఆగ్రహానికిగురై అతడి స్నేహితులైన శివనగర్‌కు చెందిన కందగట్ల నాగరాజు (24), మామిడాల రేవంత్ (19), బల్ల కార్తీక్ అలియాస్ బల్ల (19), మాచిక రాజేశ్ (20), బంబక్ ఆకాశ్ (29)తో కలిసి దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన పవన్ కల్యాణ్‌ను ఎంజీఎం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తరపు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బార్ అండ్ రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా 19 ఏళ్ల యువకులను బార్ అండ్ రెస్టారెంట్‌లోకి అనుమతించి మద్యం విక్రయించిన బార్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు.