డబ్బు కోసం గడ్డి తినేవారు ఈ లోకంలో కొదవేమీ లేదనేందుకు ఎన్నో ఉదంతాలు మన కళ్ల ముందు కనబడుతూనే వున్నాయి. మానవీయ విలువలకు పాతరేసి రక్త సంబంధీకులను సైతం పచ్చ నోట్ల కోసం పొట్టనబెట్టుకుంటున్న సంఘటనలు ఎన్నో. అలాంటి దారుణం తెలంగాణలోని సూర్యాపేటలో జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... సూర్యాపేట పరిధిలోని తాడ్వాయికి చెందిన సైదులు గత నెల 24న వాహనం ఢీకొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐతే మృతుడి పేరుపై రూ. 50 లక్షల బీమా వుందని తెలిసి పోలీసులు అనుమానపడ్డారు.
పైగా ఒంటరిగా జీవిస్తున్న సైదులకి ఇంత పెద్దమొత్తంలో బీమా ఎవరు చేయించారన్న కోణంలో దర్యాప్తు చేయగా షాకింగ్ విషయం తెలిసింది. అదేమిటంటే... మృతుడి అన్న కుమారుడు రమేష్ తన బాబాయికి ఇంత పెద్ద మొత్తంలో బీమా చేయించినట్లు తేలింది. ఐతే రమేష్ ఇటీవలే ఫైనాన్స్ కింద నాలుగు లారీలు కొనుగోలు చేశాడు.
కానీ లాభాలు అంతగా రాకపోవడంతో ఫైనాన్షియర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం మొదలైంది. ఇది భరించలేని రమేష్.. బాబాయికి బీమా చేయించి, ఆపై తన స్నేహితులతో కలిసి గత నెల 24న బొలేరో వాహనంతో ఢీకొట్టి చంపేశాడు. ఆ తర్వాత అది రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి బీమా సొమ్ము కాజేసేందుకు ప్లాన్ వేశాడు. కానీ, పోలీసుల దర్యాప్తులో వాస్తవం బయటపడటంతో ఊచలు లెక్కిస్తున్నాడు.