సూర్యపేట తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో గురువారం ఉదయం బాంబు పేలడంతో గ్రామస్తులు హడలిపోయారు. ఎక్కడ ఏం జరిగిందో అని పరుగులు తీశారు. తీరా బయటకు వచ్చి చూస్తే ఓ పెంపుడు కుక్క నాటు బాంబుని నోట కరచుకుని కొరకడంతో ఒక్కసారిగా అది పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు పేలడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటకీ స్థానికంగా ఇంకేమన్నా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అడవి పందులను వేటాడటానికి పెట్టే పేలుడు పదార్థంగా గ్రామస్తుల్లో కొద్దిమంది చెబుతున్నప్పటకీ డాగ్ స్క్వాడ్ వస్తే కానీ పూర్తి వివరాలు వెల్లడించలేమని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో 1995వ సంవత్సరంలో ఎలక్షన్ల సమయంలో ఇదే గ్రామంలో కమ్యూనిస్టు, టిడిపి కాంగ్రెస్ సంబంధించిన వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఆ ఘర్షణలో ఇలాంటి పేలుడు పదార్థాలను ఒకరిపై ఒకరు వేసుకోవడం జరిగింది. మరలా ఈరోజు ఈ పేలుడు ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.