తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ 2022-23 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేసింది. దీనికి కారణం ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టింది. త్వరలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.
ఈ 8 కొత్త వైద్య కాలేజీల్లో జగిత్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఎన్‌ఎంసి ఇప్పటికే అనుమతి ఇవ్వగా, మహబూబాబాద్, మంచిర్యాలు, కొత్తగూడెం, రామగుండంలో మిగిలిన నాలుగింటికి మరికొన్ని వారాల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇపుడు కొత్తగా మరో 1200 వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లో మరో 3500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఎనిమిది వైద్య కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని రూ.1479 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, అసిఫాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా వైద్య కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.