Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లగచర్ల దాడి కేసు : భారాస మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి అరెస్టు

patnam narender reddy

ఠాగూర్

, బుధవారం, 13 నవంబరు 2024 (12:13 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. భూములు ఇవ్వబోమంటూ లగచర్ల గ్రామస్థులు నిరసన తెలుపుతూ కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
భారత రాష్ట్ర సమితి నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడిన 55 మందిని పోలీసులు మంగళవారం గుర్తించారు. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా భూసేకరణ అభిప్రాయం కోసం కలెక్టరుతో పాటు వెళ్లిన ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిని పట్టుకుని గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్ రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై కూడా రైతులు దాడి చేశారు. ఈ దాడి ఘటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 
 
మరోవైపు, పట్న నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పట్నం అరెస్టు రేవంత్‌ చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటును బీఆర్‌ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడిన ప్రజాప్రతినిధులను..అరెస్టు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదన్నారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు, లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని, ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎన్నో చూశామన్నారు. నరేందర్‌రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కస్టడీలో ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఠాణా దాసోహం... మరో వీడియో లీక్