Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కస్టడీలో ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఠాణా దాసోహం... మరో వీడియో లీక్

borugadda anil

ఠాగూర్

, బుధవారం, 13 నవంబరు 2024 (11:46 IST)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త బోరుగడ్డ అనిల్‌కు ఏపీ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో నిద్రపోయేందుకు పోలీసులు పరుపు, దిండు వంటి సౌకర్యాలు సమకూర్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇపుడు మరో వీడియో బయటకు వచ్చింది. పోలీస్ కస్టడీలో ఉన్న బోరుగడ్డను గుంటూరులోని అరండల్ పేట స్టేషన్‌లో ఉన్నారు. అక్కడకు అతని మేనల్లుడుని పిలుపించుకుని తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని చిరు నవ్వులు చిందిస్తూ కనిపించాడు. అంతేనా.. ఏంట్రా అల్లుడు.. ఏం చేస్తున్నావంటూ పలకరించి తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలుడు చెవిలో ఏదో రహస్యంగా చెబుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. 
 
పైగా, 'నాపై ఐటీ యాక్టులు ఎలా పెడతారు' అంటూ బోరుగడ్డ ప్రశ్నిస్తున్న మాటలు వినిపించాయి. వారి పక్కనే మరో కుర్చీలో స్టేషన్ కానిస్టేబుల్ కూర్చొని ఉన్నారు. కాసేపటికి ఎదురుగా టేబుల్‌పైనున్న పేపర్ తీసుకొచ్చి ఇవ్వాలంటూ అనిల్ ఆజ్ఞాపించగా, కానిస్టేబుల్ తెచ్చి ఇచ్చారు. స్టేషనులో ఉన్న ఓ పేపర్‌ను బయటకు తీసి ఆ బాలుడికి చూపించారు. అది ఎఫ్ఐఆర్ కాపీనా, ఇంకేదైనా డాక్యుమెంటా అన్నది తేలాల్సి ఉంది. ఠాణాలో ఎక్కడేం జరిగినా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలించేందుకు ఇన్‌స్పెక్టరు నేరుగా యాక్సెస్ ఉంటుంది. ఈ తతంగమంతా రికార్డు అయి, బయటకు వచ్చాక కూడా స్పందించకపోవడం గమనార్హం.
 
మరోవైపు, గుంటూరులోని ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబూప్రకాశ్‌ను రూ.50 లక్షలు డిమాండ్ చేసి బెదిరించిన కేసులో అరండల్ పేట పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తరలించి, అక్టోబరు 26 నుంచి 29 వరకు అరండల్ పేట స్టేషనులో విచారించారు. ఆ సమయంలో అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేసినట్లు ఇటీవల సీసీ ఫుటేజీ బయటకొచ్చింది. ఠాణాలోనే ప్రత్యేకంగా దిండుతో పడక ఏర్పాటు చేయడం, పోలీసులకే నిందితుడు ఆర్డర్లు వేయడం.. అతను చెప్పిన దానికల్లా తలూపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
 
అనిల్ ఆరోగ్య సమస్యల దృష్ట్యా సౌకర్యాలు కల్పించామని, నేలపై నిద్రిస్తే ఊపిరాడడం లేదని బల్లపై పడక వేశామని పోలీసులు సమర్ధించుకున్నారు. పైగా ఆ వీడియో ఫుటేజీ బయటికెలా వచ్చిందంటూ మీడియాపై అసహనం వెళ్లగక్కారు. తాజాగా మైనర్ అబ్బాయి స్టేషనులోకి వచ్చి, రిమాండ్ ఖైదీతో కుర్చీలో కూర్చొని మాట్లాడినా సిబ్బంది యథాశక్తి సహకరించడం గమనార్హం. ఓ రౌడీషీటర్‌కు పోలీసులు ఇంతలా సాగిలపడటంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం- 9 గొర్రెలు మృతి