Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటన... 21 మంది ఇంజినీర్లు బాధ్యులు

Medigadda

ఠాగూర్

, మంగళవారం, 20 ఆగస్టు 2024 (13:35 IST)
తెలంగాణా రాష్ట్రంలో గత భారాస ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషను అందజేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సి.వి.ఆనంద్ సమర్పించిన నివేదికలో 21 మంది ఇంజినీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 
 
ఆ సమయంలో విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్ రతన్ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు రికార్డులన్నీ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. మేడిగడ్డతో సంబంధమున్న ఇంజినీర్లందర్నీ విచారణకు పిలిపించి, వివరాలను సేకరించారు. నాణ్యత లేమి, డిజైన్‌లో లోపాలు, పని ముగియకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం, పెరిగిన వ్యయం, నిర్వహణ లోపం, పని చేయని క్వాలిటీ కంట్రోల్ ఇలా... అనేక అంశాలపై దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించారు. ఆయన మరణం అనంతరం విజిలెన్స్ దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రభుత్వానికి నివేదిక అందజేయలేదు. 
 
ఈ పరిస్థితుల్లో తమకు నివేదికను అందజేయాలని జస్టిస్ పీసీ ఘోష్... విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ఇటీవల విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ మధ్యంతర నివేదికను రూపొందించి సోమవారం కమిషన్కు సమర్పించారు. ఇందులో 21 మంది ఇంజినీర్ల పాత్రను గుర్తించి, ఎవరి ప్రమేయం ఏంటన్నది వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. 
 
ప్రాణహిత - చేవెళ్ల పునరాకృతి, కాళేశ్వరం ఎత్తిపోతల, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో తీసుకొన్న నిర్ణయాలు, మీటింగ్ మినిట్స్‌ సమగ్రంగా పొందుపరచినట్లు సమాచారం. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికను ఇవ్వాలని, తుది నివేదికను సమర్పించాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ ఘోష్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విజిలెన్స్ తుది నివేదిక కోసం నీటిపారుదల శాఖ కార్యదర్శికి, సీఎంవోకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ లేఖ రాసినట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ దోమల దినోత్సవం- మలేరియా, డెంగ్యూ, జికా వైరస్‌లకు బైబై.. ఎలా?