తెలంగాణలోని హనుమకొండ జిల్లా ఇందిరానగర్ గ్రామ శివారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2000 నాటుకోళ్లను వదిలి వెళ్లిపోయారు. ఆ కోళ్లు కాస్తా పొలాల్లో తిరుగుతూ వుండటంతో అటుగా వచ్చిన స్థానికులు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ఆ కోళ్లు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసారు.
కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ సమాచారం అందలేదు. దాంతో గ్రామస్తులంతా కోళ్లను వెంటబడి పట్టుకుని చికెన్ కూర చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో విషయం కాస్తా పశువైద్యాధికారి దీపికకు చేరింది. వెంటనే ఓ కోడిని ఆమె ల్యాబుకి పంపించారు. అంత పెద్ద సంఖ్యలో కోళ్లను ఎందుకు వదిలారు... వాటికి ఏమైనా వ్యాధి సోకిందా... అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అసలు విషయం తెలిసేవరకూ ఎవ్వరూ ఆ కోళ్లను తినవద్దని వైద్యాధికారి తెలియజేసారు.